Archive for జనవరి, 2010

ఆవు – దూడ

28/01/2010

ఒక సారి మేత మేయడానికి ఆవు ఒకటి ఆడవికి వెళ్ళింది.అలా మేస్తూ అది బాగా ఆడవిలోకి వెళ్ళిపోయింది.అక్కడ ఒక పులి ఆవుని చూసింది.ఆవుని తినాలని దాని దగ్గరకి వచ్చింది.ఆవుతో ఇలా అన్నది – “నాకు బాగా ఆకలిగా ఉంది.నేను నిన్ను తినాలని అనుకొంటున్నాను.” అప్పుడు ఆవు – “అయ్యా పులిగారు తప్పకుండా నన్ను తినండి.కాకపోతే నాదొక విన్నపం.నా కోసం నా బిడ్డ ఎదురుచూస్తుంటుంది.దానికి కాసిన్ని పాలు ఇచ్చి మీదగ్గరకి వస్తాను ” అని అంటుంది.

అప్పుడు పులి నేను నిన్ను ఎలా నమ్మేది అని అడుగుతుంది.ఆవు నేను ఖచ్చితంగా వస్తాను.ఒక వేల ఇప్పుడు మీ దగ్గరనుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన ఎప్పటికైన మీకు దొరకకమానను. నామీద నమ్మకం ఉంచి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అంటుంది. సరేనని పులి అనుమతి ఇస్తుంది.ఆవు ఆనందంతో ఇంటికి వెళ్ళి తన దూడకి పాలు ఇచ్చి దానికి కొన్ని మచి బుద్దులు చెప్పి పులి దగ్గరకి బయలుదేరుతుంది.అలా పులి దగ్గరికి చేరుకొని ఇలా అంటుంది – “నేను వచ్చేశాను .ఇప్పుడు మీరు నన్ను ఆరగించండి.” ఆవు నిజాయితికి ఆశ్చర్యపోయిన పులి తిరిగి – ” నీ నిజాయితికి నేను ముగ్ధుడను అయ్యాను.నీవు వెళ్ళి హాయిగా నీ బిడ్డతో జీవించు నిన్ను వదిలిపెడుతున్నాను.” అని అంటుంది.ఆవు పులికి కృతజ్ఞతలు తెలిపి తన దూడ దగ్గరికి వెళ్ళిపోతుంది.

దయకు దొరికిన ఫలం

27/01/2010

ఉదయవీర్ మొదట్లో చాలా పేదవాడుగా ఉండేవాడు.అతను సాధారణ సిపాయిగా ఉండేవాడు.ఓ రోజు తుపాకి తీసుకొని గుర్రమెక్కి వేటకి వెళ్ళాడు.ఆ రోజు అడవి అంతా గాలించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు.అలా చాలా దూరం వెళ్ళగా ఒక జింక,జింక పిల్ల కనపడ్డాయి.గుర్రాన్ని జింకల వైపు పరిగెత్తించాడు.జింకేమో పరిగెత్త్తి పొదలో దాక్కుంది, పాపం జింక పిల్ల దొరికిపోయింది.దాని నాలుగు కాళ్ళు కట్టివేసి గుర్రం మీద వేసి దాని తల్లి కోసం గాలించసాగాడు.ఎంత వెదికినా అది కనపడక పోవడంతో నిరాశ చెంది తిరిగి పోసాగాడు.
ఉదయవీర్ తనపిల్లను బంధించి తీసుకొని పోతూండటం తల్లి జింక చూసింది.బిడ్డ మీద ప్రేమ కొద్ది,అది పొద నుంచి బయటకి వచ్చింది.ఉదయవీర్ గుర్రం వెంట పరిగెత్త సాగింది.కొంచెం దురం వెళ్ళాక ఉదయవీర్ వెనక్కి తిరిగి చూశాడు.తన వెంబడే జింక రావడం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది.అతని హృదయం కరిగి పోయింది. జింక పిల్లను వదిలి పెట్టాడు.జింక సంతోషంతొ పిల్లతో సహా ఎగెరుకుంటూ అడవిలోకి పారిపోయింది.
కొంతకాలానికి అతను చక్రవర్తి అయ్యాడు.కాబట్టీ మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు.అది ఎప్పుడో ఒకప్పుడు మనకి ఫలితాన్ని ఇస్తుంది.అదే ఉదయవీర్ విషయంలో నిజమైంది.

కలిసి వుంటే కలదు సుఖం

26/01/2010

ఓ అడవిలో ఓ సింహం, ఓ చిరుత పులి ఉండేవి.సింహమేమో బలమైనది.కాని వయస్సు మళ్ళిన కారణంగా సరిగ్గా పరిగెత్త లేకపొయేది,వేటాడలేకపొయేది.చిరుత పులి బాగా బలంగా ఉన్నా, సింహమంటే భయపడేది,దానితో స్నేహం చేసేది.ఎందుకంటే అది మృగరాజు కాబట్టి.అది కాక ఆ సింహం ముసలిదైనా బాగా బలిష్ఠంగానే ఉండేది.
ఒకసారి ఎన్ని రోజులు గడిచినా రెంటికి ఆహారం దొరకలేదు.రెండూ ఆకలితో నకనక లాడుతున్నాయి.దగ్గరలో ఆకులు,అలమలు మేస్తున్న జింక పిల్లను చూశాయి.”నేను జింకపిల్లను వొడిసి పట్టేస్తాను.మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి.” అని చిరుత సింహంతో చెప్పింది.సరేనని సింహం దూరంగా వుండి పోయింది.చిరుతపులి పరిగెత్తుకొని వెళ్ళి పట్టుకొని జింక పిల్లను కొరికి చంపేసింది.ఆ జింకపిల్ల మరీ చిన్నదిగా ఉండటంతో అది ఒకరికే సరిపోయేలాగ ఉంది.కాని అవి రెండు బాగా ఆకలిగా ఉన్నాయి.రెంటి నోళ్ళు ఊరుతున్నాయి.”జింక పిల్లను నేనే చంపాను కాబట్టి దీన్ని నేనే తింటాను.” అంది చిరుత.
“నేను మృగరాజుని తెలుసా! కనుక నేనే జింకపిల్లను తింటాను.ఎలాగూ నీవు బాగా పరిగెత్తగలవు.కనుక ఇంకో జంతువును వేటాడి తిను.” అని  గర్జించి చెప్పింది సింహం.ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.రెండు ఒకదాని మీద ఒకటి పంజా విసురుకొవడం మొదలుపెట్టయి.ఆ ప్రక్కనే పొదల చాటున ఒక నక్క దాక్కొని ఇదంతా చూస్తూ ఉంది.సింహం,చిరుత బాగా పోట్లాడుకొని అలసి పడిపోయాయి.అదే అదనుగా భావించి ఆ జింకపిల్లను నక్క వచ్చి లటుక్కున ఎత్తుకొని పోయింది.కాబట్టీ ఆలొచించకుండా అనవసరంగా పోట్లాడుకుంటే అది మనకు కాకుండా ఇంకరికి పోతుంది.అదే అవి రెండు సమానంగా పంచుకొని ఉంటే వాటికి కనీసం కొంతయినా ఆకలి తీరి ఉండేది.

కుందేళ్ళు – కప్పలు

25/01/2010

అవి మండుటెండలు గల రోజులు.పొలాల్లో ఎలాంటి పంటలు లేని కారణంగా కుందేళ్ళు ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి.మైదానాలలో పొదలు ఎండిపొయాయి.కుక్కలు విచ్చలవిరివిగా తిరగడం వలన పాపం వాటికి బయటకి రావాలంటే భయమేయసాగింది.దానితో దిక్కు తోచక అన్నీ కలిసి సమావేశమయ్యాయి.

ఓ కుందేలు ఇలా అంది – “బ్రహ్మదేవుడు మనజాతికి చాలా అన్యాయం చేశాడు.మనల్ని చిన్నవిగా,చేతగాని ప్రాణుల్లా సృష్టించాడు.దుప్పుల్లాగా కొమ్ములు ఇవ్వలేదు,పిల్లులకి మాదిరిగా పెద్దగోళ్ళు ఇవ్వలేదు.శత్రువుల నుంచి ప్రాణాలు రక్షించుకోలేము.ఎవరైనా మన మీద దాడి చేస్తే పారిపోవటం తప్ప ఇంకో మార్గం లేదు.” ఇంకో కుందేలు “ఈ కష్టాలు ,భయాలు నాకొద్దు బాబు! నేను ఏ చెరువులోనో పడి చచ్చిపోవాలనుకొన్నానూ అని అంది.మరొ కుందేలు ఇలా చెప్పింది – ‘నేను కుడా చచ్చిపోవాలనుకొన్నాను.నేను ఇంకెంత మాత్రమూ ఈ కష్టాలు పడలేను.నేనిప్పుడేవెళ్ళి చెరువులో దూకి చస్తాను.” “మేము కూడా నీవెంటే వస్తాం.మనమంతా కలిసే బతికాం, కలిసే చద్దాం.” – అని అన్నీ ఒక్కసారిగా అరిచాయి.అలా చావడనికి చెరువు వైపు బయలుదేరసాగాయి.

కుప్పలు తిప్పలుగా కప్పలు చెరువు గట్టు మీద కూర్చున్నాయి.కుందేళ్ళ అలికిడి వినగానే అవి భయపడి చెంగుచెంగున చెరువులోకి దూకాయి.కప్పలు భయపడి నీళ్ళలోకి దూకడం చూసి కుందేళ్ళు ఆగిపొయ్యాయి.అప్పుడు ఓ కుందేలు తోటి మిత్రులతో ఇలా అంది – “సోదరులారా! మనం చావలిసిన పని లేదు.రండి తిరిగి వెళ్దాం.దేవుని సృష్టిలో మనకంటే చిన్నవి,భయపడే ప్రాణులూ ఉన్నాయి.అవి బతుకుతున్నప్పుడు, మనమెందుకు చావాలి?’

ఆ మాటలు విన్న మిగతా కుందేళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా తిరిగి వెళ్ళాయి.కాబట్టి కష్టాలు అనేవి అందరికి ఉంటాయి.మనకంటె హీనంగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు.మనమే వాళ్ళకంటే ఎంతో సుఖంగా ఉన్నాం అనుకొంటే ఎవరికీ ఎటువంటి కష్టాలు ఉండవు.

వెళ్ళండి – రండి

22/01/2010

ఓ ఊళ్ళో శంకరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు.అతనికి చాలా పొలాలు ఉండేవి.ఆ పొలాల్లో చాలా మంది కూలీలు , జీతగాళ్ళు పనిచేశేవారు, శంకరయ్య చాలా సోమరి.ఎప్పుడూ పొలాల వైపు వెళ్ళకుండా పని వాళ్ళ మీద వదిలేసేవాడు.పనివాళ్ళు సరిగా చేయకుండా కాలం గడిపే వారు.పొలాలని సరిగా దున్నకుండా, వాటికి నీళ్ళు పెట్టకుండా,ఎరువులు వేయకుండా వదిలేసేవారు.దాని వలన పంట దిగుబడి ఎటికేటికి దిగుబడి తగ్గసాగింది.తొందరగా బీదవాడు అయ్యాడు.
అదే ఊరిలో రామయ్య అనే మరో రైతు ఉండేవాడు.అతనికి ఎమీ పొలం ఉండేది కాదు.కౌలుకు భూమి తీసుకొని సాగు చేసుకొనేవాడు.బాగా కష్టపడి పని చేసేవాడు.అంతేకాముండా ఇంటిల్లిపాది తనతో పని చేసేవారు.పంటలు బాగా పండాయి.అన్నీ కర్చులు పోను బాగా డబ్బులు మిగిలాయి.కొంతకాలానికి బాగా డబ్బు వచ్చింది.
శంకరయ్య బాగా అప్పుల్లో కూరుకు పోయి పొలాలు అమ్మే స్థితికి వచ్చాడు.ఇది తెలిసిన్ రామయ్య శంకరయ్య దగ్గరకి వచ్చి అతనితో ఇలా అన్నాడు.-“మిరూ పొలాలు అమ్ముతున్నారని తెలిసింది.దయచేసి నాకు అమ్మండి.మీగతా వాళ్ళ్కంటే ఎక్కువ ధర చెల్లిస్తాను”.శంకరయ్య నోరు వెళ్ళబెట్టాడు – “రామయ్యా!ఇన్ని భూములుండే నేను అప్పుల్లో కూరుకుపొయాను.సొంత భూములు లేని నీకు డబ్బెక్కడినుంచి వచ్చింది?నీవు నా భూములునే తీసుకున్నావు కదా కౌలుకి?
అప్పుడు రామయ్య ఇలా బదులు చెప్పాడు – “నాకెవరూ డబ్బు ఇవ్వలేదు.నేను కష్టపడి సంపాదించినదే,కూడబెట్టినదే.మేసేద్యానికి,నాసేద్యానికి తేడా ఉంది. మిరు నౌకర్లని పనిచేయడానికి ‘వెళ్ళండి – వెళ్ళండి ‘ అంటారి.అందువల్ల మీ సంపద అంత హరించుకు పొయింది.నేను పని వాళ్ళకంటే ముందు సిద్దమై వాళ్ళని నాతో పాటు పని చేయటానికి ‘ రండి – రండి ‘ అని పిలుస్తాను.అందువల్ల నా ఇంట్లో సిరిసంపదలు నిండాయి.
దానితో శంకరయ్యకి తన తప్పు ఏమిటో తెలిసింది.అతను రామయ్యకు తన భూములు కొన్ని అమ్మి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు.అప్పటి నుంచి ఒళ్ళు వొంచి పని చేసాడు.తరువాత తన స్థితి మెరుగుపడింది.

మూర్ఖరాజు

21/01/2010

అక్బర్ కి బీర్బల్ అంటే బాగా ఇష్టం.ఎందుకంటే బీర్బల్ కి గొప్ప తెలివితేటలు ఉండటమే కాకుండా, తన హాస్యోక్తులతో చక్రవర్తిని చాలా సంతోష పెట్టేవాడు.ఒకసారి అక్బరు చక్రవర్తి అంతఃపురానికి వెళ్ళాడు.చక్రవర్తి గారి ప్రియాతిప్రియమైన బేగం తన స్నేహితురాలితో ఏదో మాట్లాడుతున్నారు.చక్రవర్తి అక్కడికి వెళ్ళాడు.బేగం లేచి “దయచేయ్యండి మూర్ఖరాజా! దయచేయ్యండి” అన్నారు.చక్రవర్తికి చాలా కోపం వచ్చింది.కాని ఇంతకు ముందు తనను ఎప్పుడూ ఇలా అనలేదు,అంతేకాక తన తెలివైనది అని తెలుసు.కాని తను ఎందుకు ఇలా అన్నదో అడగడానికి మనసు రాలేదు.అలా కొంచెంసేపు కోర్చొని తన భవనానికి వెళ్ళిపొయాడు.
అలా విచారంగా అలోచిస్తుండగా అక్కడికి బీర్బల్ వచ్చాడు.బీర్బల్ని చూడగానే “మూర్ఖరాజుకి స్వాగతం” అన్నాడు.బీర్బల్ నవ్వుతూ “సంతోషం మూర్ఖరాజూ” అన్నాడు.అప్పుడు అక్బరు కోపంతో “బీర్బల్ నీవు నన్ను మూర్ఖరాజు అని ఎందుకు అన్నావు?” అని అడిగాడు.
బీర్బల్ వినయంగా బదులు ఇచ్చాడు – “ఐదు కారణాల వలన మనిషిని మూర్ఖునిగా జమకడతాం. 1.ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు, పిలవకనే ఎవరైనా వాళ్ళమధ్యకు వెళ్ళినా, ముందుగా తెలుపకుండా వెళ్ళినా అతన్ని మూర్ఖుడంటాం. 2.ఇద్దరు పరస్పరం మాట్లాడుతున్నప్పుడు,వాళ్ళమాటలు ముగియక ముందే మూడో వ్యక్తి జోక్యం కల్పించుకొని ఆ సంభాషణలో చొరబడితే అతన్ని మూర్ఖుడంటాం. 3.ఎవరైనా ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు,అతని మాటలు పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడే మనిషి కూడా మూర్ఖుడంటాం. 4.కారణం లేకుండా ఇతరులను తిట్టెవాళ్ళని కూడా మూర్ఖుడంటాం. 5.అలాగే మూర్ఖుల వద్దకు వెళ్ళే వాళ్ళని, మూర్ఖులతో కలిసి తిరిగే వాళ్ళని కోడా మూర్ఖులంటాం.”
బీర్బల్ మాటలు విన్న అక్బరు సంతోషించి తను చేసిన తప్పుని తెలుసుకొన్నాడు.

నిజం విలువ

20/01/2010

ఒకనొక ఊరిలో ఒక బందిపోటు ఉండేవాడు.ఒకరోజు దొంగతనానికి బయలుదేరాడు.అర్థరాత్రి అవడానికి ఇంకా చాలా సమయం ఉంది.కాలక్షేపం కోసం ఒక సభలోకి వెళ్ళి కూర్చున్నాడు.ఒక సాధువు బోధనలు చేస్తున్నాడు.అతని సూక్తులు ,ప్రవచనాలు చాలా ఆనందంగా,ఆహ్లాదంగా ఉన్నాయి.ప్రవచనాల తరువాత బందిపోటు సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు – “స్వామి నేనొక బంధిపోటుని, చాలా మందిని దోచుకున్నాను, కొంతమందిని చంపేసాను కూడా…దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా?” దానికి సమాధానంగా సాధువు ఇంక నుంచి నిజమే చెప్పు అన్నాడు.
సాధువు మాటలు ఆచరించాలని బంధిపోటు నిర్ణయించుకున్నాడు.మరునాడు రాజుగారి ఖజానాలో నుంచి కొంత ధనన్ని తస్కరించాలని పధకం వేశాడు.అతడు కోట ముఖద్వారం వద్దకు ప్రవేశించగానే భటుడు “ఎవరు నువ్వు” అని ప్రశ్నించాడు.దానికి “నేనొక బందిపొటుని” అని సమాధానం చెప్పాడు.అతని మాటలు భటుడు నమ్మలేదు సరి పైగా మారువేషంలో ఉన్న ముఖ్య అధికారి అని అతనిని లోపలికి అనుమతించాడు.అతను లోపలికి వెళ్ళి బాండాగారంలో  ఉన్న రత్నాల సంచిని తీసుకొని వస్తుంటే మళ్ళి అదే భటుడు “ఏమి తీసుకెళ్తున్నావు ?” అడిగాడు.”రత్నాలు.ఇవే నాకు దొరికాయి.” “ఎవరి అనుమతితో తీసుకెళ్తున్నావు?” “అనుమతా? నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను వీటిని దొంగలించుకొని వెళ్తున్నాను.” అని బందిపోటు చెప్పాడు.భటుడు తెల్లబోయాడు.అతనికి అంతా అయొమయంగా ఉంది.బంది పోటుని ఇంకా ముఖ్య అధికారిగానే తలిచి వదిలి వేశాడు.
మరునాడు ఉదయం దొంగతనం బయట పడింది.విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పే దోచుకున్నాడన్న సంగతి బయట పడింది. రాజు ఆశ్చర్య పోయాడు.అతని కోసం గాలించారు.బందిపోటు ఇంకా నగరంలో ఉండడం వలన సైనికులు అతనిని పట్టుకున్నారు.బంధిపోటు రాజుగారితో కూడా నిజమే చెప్పాడు.అతని పట్ల ఆకర్షితుడైన రాజు అతనికి రాజాస్థానలోనే విలువైన వస్తువుకు కాపాడే అధికారిగా నియమించాడు.నిజం మాట్లాడితే జరిగే మంచి ఏమిటొ బంధి పోటుకి ఆరోజు అర్థమైంది.అప్పటినుంచి దొంగతనాలు మాని మంచి బతకాలని నిర్ణయించుకున్నాడు.అలా మంచి వాడిగా మారి రాజాస్థానంలో మంచి పేరు సంపాదించుకునాడు.