Archive for ఫిబ్రవరి, 2010

బంగారు గొడ్డలి

09/02/2010

రామయ్య నిజాయితీ కల వాడు, కాని పాపం, పేద వాడు. పగలంతా కట్టెలు కొట్టి , సాయంకాలం బజారుకెళ్ళి వాటిని అమ్మిన డబ్బులుతొ జీవనం సాగించేవాడు. అలా ఒక రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళి నది వొడ్డున ఎండు చెట్టు నరుకుతుండగా చెయ్యి జారి గొడ్డలి నదిలో పడిపోయింది. నదిలో దిగి ఎంత వెతికినా కనపడలేదు. ఎంతో విచారంతో , నది వొడ్డున విచారంతో తల పట్టుకొని కూర్చుండి పోయాడు. పాపం ఇంకో గొడ్డలి కొనడానికి డాబ్బులు కూడా లేవు. గొడ్డలి లేకపోతే ఇంటిల్లి పాది పస్తులుండాలి. అతని పరిస్థితిని చూసిన వనదేవత బాలుని రూపంలో ప్రత్యక్షమై – ” అన్నా! నీవు ఎందుకు ఏడుస్తున్నావు? ” అని అడిగాడు.
రామయ్య అతనికి నమస్కారం చేసి ఇలా అన్నాడు – ” నా గొడ్డలి నీళ్ళాలో పడిపోయింది. మరి కట్టెలు ఎలా కొట్టేది? నా భార్యా పిల్లను ఎలా పోషించేది?” “నీవు బాధ పడద్దు. నేను నీ గొడ్డలి తెస్తాను ” అని వన దేవత అన్నాడు. దేవత నీటిలో మునిగి , ఓ బంగారు గొడ్డలి తెచ్చి – “ఇదిగో , నీ గొడ్డలి తీసుకో ” – అన్నాడు. రామయ్య అది చూసి “ఇది బంగారు గొడ్డలి. ఇది నాది కాదు” అన్నాడు.దేవత రెండో సారి మునిగి వెండి గొడ్డలి త్చ్చి ఇవ్వబోయాడు. రామయ్య – ” స్వామి! నా అదృష్టం బాగా లేదు. మీరు ఎంత వెతికినా నా గొడ్డలి చిక్కడం లేదు.నాది మామూలు ఇనుప గొడ్డలి ” అని చెప్పాడు. దేవత మూడోసారి మునిగి, ఇనుప గొడ్డలి తెచ్చాడు. రామయ్య సంతోషించి, తన గొడ్డలి తీసుకొని కృతజ్ఞతలు చెప్పాడు. వనదేవత రామయ్య నిజాయితీని మెచ్చుకొని  బంగారు,వెండి గొడ్డళ్ళు కూడా ఇచ్చాడు.
రామయ్య అవి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకు ధనవంతుడయ్యాడు. కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళడం మానేసాడు.పొరుగింటి పుల్ల్లయ్య ఓ రోజు ” నీవెందుకు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడం మానేసావు ?” అని రామయ్యను అడిగాడు. జరిగిన కథంతా చెప్పాడు రామయ్య. పుల్లయ్య వొట్టి దురాశాపరుడు. బంగారం, వెండి మీద ఆశతో కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. కట్టెలు కొడుతూ గొడ్డలి జార విడిచి, చెత్తుకింద కూర్చొని ఏడవసాగాడు. వనదేవత పుల్లయ్య దురాశ తగిన పాఠం చెప్పాలని ప్రత్యక్షమయ్యాడు. పుల్లయ్యను అడిగి, నీళ్ళలో మునిగి బంగారు గొడ్డలి పైకి తీసి చూపించాడు. పుల్లయ్య ఆనందంతో ఎగిరి గంతేశాడు – “ఇది నా గొడ్డలి!” అని కేకవేశాడు. “నీవు అబ్ద్దం చెప్తున్నావు .ఇది నీది కాదు” అని దాన్ని నీళ్ళలో వేసి, వనదేవత మాయమయ్యాడు.  అత్యాశకు పోయిన పుల్లయ్య ఇనుప గొడ్డలి కూడా పొగొట్టుకొని లబొదిబోమంటూ ఇంటికి బయలుదేరాడు.       

తాబేలు – కుందేలు

08/02/2010

ఓ అడవిలో కుందేలు ఒకటి ఉండేది. సాధారణంగా కుందేళ్ళు చిన్నవిగా ఉన్నా వేగంగా పరిగెత్తతాయి. ఆ కుందేలు తన కన్నా వేగంగా ఎవరూ పరిగెత్తలేరని విర్రవీగుతూ ఉంది. అక్కడ పక్కనే  ఆ మాటలు విన్న తాబేలు – ” అన్నా! నీవు చాలా వేగంగా పరిగెత్తగలవు. కాని అంత గర్వం పనికి రాదు, అలాఅయితే ఎప్పుడొ ఒకసారి అవమాన పడక తప్పదు” అంది. దానికి బదులుగా కుందేలు – ” నీకు ఉన్న మాట అంటే ఉలుకెందుకు? నీవు పురుగులాగా చిన్నగా పాకుతూ ఉంటావు. నన్ను చూసి నీకు కడుపు మంట.” అంతే కాక అలా ప్రతిసారి తాబేలును కుందేలు అవమానించ సాగింది. అవి భరించలేక ఒకసారి తాబేలు – ” ఊరికే గొప్పలు చెప్పుకోవటం కాదు.నాతో పందెం కాయి. ఎవరు గెలుద్దారో చుద్దాం ! ” అన్నది. కుందేలు దూరంగా ఉన్న ఒక చెట్టుని చూపించి తాబేలుతో ఇలా చెప్పింది – “అలాగే కానివ్వు. ఆచెట్టు వద్దకు ఎవరు ముందుగా వెళ్తారో , వాళ్ళే పందెం గెలిచినట్లు. సరేనా?”

పాపం! తాబేలు నిదానంగా దేకుతుంది. అది చెట్టుకు కాసింత దూరంలో ఉండ గానే, మొదలు పెట్టినానేను నాలుగు గెంతులు గెంతితే చాలు, దాన్ని దాటి పోగలను” అని  భావించింది కుందేలు. అందుకని ధీమాగా తాబేలుతో ఇలా అంది. “నీవు వొట్టి సోమరివి. మెల్ల మెల్లగా నడిస్తావు. నివు నడువు. నేను కాసేపాగి వస్తాను.”  “పరుగుపందెం ఈ క్షణమే మొదలైనట్లు తెలిసిందా? నీ ఇష్టం వచ్చినప్పుడు రా నాకేం?” తాబేలు చెప్పింది. ఆ మాటలకు కుందేలు తల ఊపింది. “ఇది చెట్టు వరకు వెళ్ళడం అంటే తెల్లారినట్లే. అందాకా ఓ చిన్న కునుకు తీస్తా” అనుకొంది కుందేలు. అది అక్కడే పడుకొని కునుకు తిసింది. మెలుకువ వచ్చేసరికి ఎంత సేపు నిద్ర పోయిందో తెలిసింది కాదు. వెంటనే గబగబా గెంతు కుంటూ చెట్టువద్దకు వెళ్ళింది. కాని తన కంటే తాబేలు ఉండటం చూసి సిగ్గుతో తల దించుకొంది. అంత గర్వం పనికి రాదని తెలుసుకొంది.

కష్టానికి ఫలం

05/02/2010

రామయ్య అనే రైతు బాగా ఆస్ఠి ఉన్న రైతే కాని పెద్ద సోమరి.పొలం పనులు చూసుకోకుండా, పశువుల గురించి పట్టించుకోకుండా ఉండేవాడు.ఏ వస్తువులు ఇంట్లో ఉన్నాయో , ఏవి ఇంట్లో పొయ్యాయో పట్టించుకొనే వాడు కాదు. దానితో ఇంటి పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది.పంటలలో నష్టాలు రాసాగింది.పాడివల్ల కూడా పెద్దగా లాభం లేకుండా పొయింది. ఓ రోజు తన మిత్రుడు హరిశ్చంద్రుడు అతనికి ఇంటికి వచ్చాడు. అతను రామయ్య ఇంటి పరిస్థిని గమనించి, చెబితే వినే స్వభావాడు కాదు అని గ్రహించాడు. ఎలాగైనా తనకు మేలు చేయాలని ఆల్చించి రామయ్య ఇలా అన్నాడు – “నీ కష్టాలు చూస్తుంటే నాగుండె తరుక్కుపోతుంది. నీ దరిద్రం పోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది.”.”బాబ్బాబూ! ఆ ఉపాయం కాస్తా చెప్పి, పుణ్యం కట్టుకో కూడదూ” నీవు చెప్పినట్లే కచ్చితం పాటిస్తాను.” – రామయ్య అంటాడు.

హరిశ్చంద్రుడు – “పక్షులు లేవకముందే మనస సరోవరంలో ఉండే ఓ హంస ఈ భూమిమీదకి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వాలుతుందో ఎవరికీ ఎవరికీ తెలియదు. కాని ఆ హంసను దర్శనం చేసుకొనే వాళ్ళకు ఎలాంటి లోతూ ఉండదు”. రామయ్య – “ఏమైనా సరే , నేను ఆ హంసను తప్పక చూడాలి.” హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు. రామయ్య మరుసటిరోజు కోడి కూయక ముందే లేచాడు. ఇల్లు దాటి, హసను వెతుక్కుంటూ పొలంవైపు వెళ్ళాడు.అక్కడ పక్కపొలం యజమాని రామయ్య ధాన్యం కుప్పనుంచి ధాన్యాన్ని తన కుప్పలోకి ఎత్తిపోసుకోవడం చూశాడు. రామయ్యను చూడగానే అతను సిగ్గుతో తలవంచుకొని, క్షమించమని ప్రార్థించాడు.పొలమ్నుంచి అతను ఇంటికి తిర్గొచ్చాడు.పశువుల పాక వైపు వెళ్తుండగా పశువుల కాపరి పాలు పిండి, తన భార్య తెచ్చిన పాత్రలోకి వంచుతుండం చూశాడు.అతన్ని మందలించి ఫలహారం తిని మాళ్ళి హంసను వెతుక్కుంటూ పొలం వైపు బయలుదేరాడు.పొలం పని చేయడానికి కులీలు ఎవరూ రాలేదు.అక్కడే ఆగి కూలీలు వచ్చిన తరువాత వాళ్ళను కోప్పాడ్డాడు. ఇలా వెళ్ళిన చోటల్లా తనకి కొంత నష్టం ఆగిపొయింది.

రామయ్య అలా ప్రతిరోజు హంసను వెతుక్కుంటూ వెళ్ళేవాడు.పొలాల్లో తిరిగేవాడు.అతన్ని చుసి కూలీలు అందరు శ్రద్దగా పని చెయ్యడం మొదలుపెట్టారు.ఇంట్లో చిల్లరదొంగతనాలు ఆగిపొయ్యాయి.పంట ఇంతకు ముందు కంటే ఎక్కువగా రాసాగింది.గేదలు,ఆవుల పాలు ఎక్కువగా రాసాగాయి. ఓ రోజు హరిషుంద్రుడు రామయ్యని చుడాలని వహ్చ్చాడు.రామయ్య తన మిత్రునితో ఇలా అన్నాడు – “నాకు ఇంతవరకు హంస కనపడలేదు.కాని, దాన్ని వెతకడంలో నాకు ఎంతో మేలు జరిగింది.'” హర్షంద్రుడు నవ్వి ఇలా అన్నాడు – “హంస అంటే ఎమి అనుకొన్నావు? కష్టపడతమే తప్ప ఇంకోటి కాదు. రెక్కల కష్టం ఊరికే పోదు. మన పని మనం చేసుకోకుండా ఇతరులకు వదిలి పెడితే నష్టపోతాము.” మన కష్టానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది.

పక్షినేర్పిన పాఠం

03/02/2010

ఒక ఊరికి దగ్గరలో సారసపక్షుల జంట నివసిస్తూ ఉండేది.ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది.కొంత కాలానికి గుడ్లలోనుంచి పిల్లలు బయటకి వచ్చాయి.వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరాటానికి ముందే పంటకోతకు వచ్చింది.సారసపక్షులకు దిగులు పట్టుకుంది.రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి వెళ్ళాలి.కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి ఇలా అంది – ‘మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.
ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయంకాలం గూడు చేరుకొంది.అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి – ” ఈ రోజు రెతు వచ్చాడు.పొలం చుట్టూ తిరిగాడు.ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలంవైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది.ఇక కోయాల్సిందే. ఈ రోజే వెళ్ళి ఊళ్ళో వాళ్ళతో నా చేను కోయమని చెప్తాను.” ‘మీరేమి భయపడకండి.రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మన్మ్ ఇక్కడే హాయిగా ఉండచ్చు.” – అని పక్షి పిల్లలతో చెప్పింది.
కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకుంది.అప్పుడు పిల్లలు బిక్కు బిక్కిమంటూ ఇలా చెప్పాయి – మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్ళాలి. ఈ రోజు రైతు మళ్ళీ  వచ్చాడు. ఊళ్ళోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు.నేను నా అన్నదమ్ములిని పిలిపించి కోయిస్తాను.” సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది – “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు.నాలుగైదు రోజుల్లో మీరు ఇంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటీకి పోనక్కర్లేదు.’
ఇలా మరిన్ని రోజులు గడిచి పొయ్యాయి.సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారసపక్షితో ఇలా అన్నాయి.- “ఈ రైతు మమ్మలిని ఉత్తుత్తినే భయపెడుతున్నాడు.ఇతడు పైరు కోసినట్లే.ఈ రోజు కూడా వచ్చాడు.” “నా అన్నదమ్ములు కూడా నా మాట వినడం లేదు.పైరు బాగా ఎండి పోయి గింజలు నేల రాలుతున్నాయి.రేపు పొద్దుపొడవగానే నేనే వచ్చి మొదలెడతాను.” అని అన్నాడు. అప్పుడు సారసపక్షి భయపడింది. – “అరరే! వెంటనే బయలుదేరండి.ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్ళి తలదాచుకొందాం.రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని అంది.
పిల్లలు ఆదుర్దాగా అడిగారు – “ఎందుకు వెళ్ళాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?” సారసపక్షి ఇలా బదులు చెప్పింది – “రైతు గ్రామస్తులను , సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలగలేదు.తనపని తాను చేయకుండా, ఇతరులను నమ్ముకున్నంత కాలం ఎవరి పనులు జరగవు.కాని ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి నిర్ణయించుకొన్నప్పుడు అవి జరిగిపోతాయి. రైతు తానే పంట కోస్తాను అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగిపోతుంది.” ఆ సారసపక్షులు వెంటనే సురక్షిత ప్రాంతానికి ఎగిరిపోయాయి.

దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు

01/02/2010

సోమయ్య తన కొడుకు రాముకి రాత్రి పూట నిద్రపోయేముందు కథలు చెప్పేవాడు.ఓ రోజు తన కొడుకుతో ఇలా అన్నాదు.”బాబూ, ఓ మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోకు.దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు సుమా” ! రాము అటూ ఇటూ తొంగి చూసి “నాన్నా, దేవుడు అన్ని చోట్లా ఉన్నాడా? మరి, నాకెక్కడా కనపడటం లేదే?” అన్నాడు ఆశ్చర్యంగా. “బాబూ, మనం దేవుని చూడలేం.కాని భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు.మనం చేసే అన్ని పనులను గమనిస్తూ ఉంటాదు”. – సోమయ్య కొడుక్కి చెప్పాడు.
రాము తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు.కొద్దిరోజుల తరువాత కరువు వచ్చింది.సోమయ్య పొలాల్లో ఎమీ పండలేదు. ఓ రాత్రి సోమయ్య కొడుకుని వెంటబెట్టుకొని ఊరవతలి పొలానికి వెళ్ళాడు. ఆ పొలం వేరే వాళ్ళది.ఎవరికీ తెలియకుండా ఒక మోపు వరి కంకులుని కోసుకొని పోవాలని సోమయ్య ఆలోచన. పొలం గట్టు మీద రాముని నిలబడమని , నీవు నాలుగు దిక్కులా జాగ్రత్తగా చూస్తుండు. ఎవరైనా కనపడితే నాకు చెప్పు ” అని సోమయ్య కొడుక్కి చెప్పాడు.
సోమయ్య పొలంలో వరికంకులు కోసేందుకని దిగాడో లేదో రాము – “నాన్నా, ఆగండి” అన్నాడు. “ఎవరైనా చుస్తున్నారా ఏం?” – సోమయ్య అడిగాడు. రాము – “ఔను నాన్నా,చూస్తున్నారు”. సోమయ్య పొలంలోనుంచి గట్టుమీదికి వచ్చి చూస్తే అతనికి ఎవరూ కనపడలేదు.అప్పుడు అతని కొడుకుని అడిగాడు – “ఎక్కడ? ఎవరు కనపడటం లేదే?”
రాము – ” దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు. అందరు చేసే పనులు గమనిస్తూ వుంటాడని మీరే చెప్పారుగా! అలాంటప్పుడు మీరు వరికంకులు కోస్తూవుంటే, దేవుడు చూడకుండా వుంటాడా?” సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గుతో తల వంచాడు. వెంటనే కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు.