Archive for ఫిబ్రవరి 1st, 2010

దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు

01/02/2010

సోమయ్య తన కొడుకు రాముకి రాత్రి పూట నిద్రపోయేముందు కథలు చెప్పేవాడు.ఓ రోజు తన కొడుకుతో ఇలా అన్నాదు.”బాబూ, ఓ మాట మాత్రం ఎప్పుడూ మర్చిపోకు.దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు సుమా” ! రాము అటూ ఇటూ తొంగి చూసి “నాన్నా, దేవుడు అన్ని చోట్లా ఉన్నాడా? మరి, నాకెక్కడా కనపడటం లేదే?” అన్నాడు ఆశ్చర్యంగా. “బాబూ, మనం దేవుని చూడలేం.కాని భగవంతుడు అన్ని చోట్లా ఉన్నాడు.మనం చేసే అన్ని పనులను గమనిస్తూ ఉంటాదు”. – సోమయ్య కొడుక్కి చెప్పాడు.
రాము తండ్రి చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నాడు.కొద్దిరోజుల తరువాత కరువు వచ్చింది.సోమయ్య పొలాల్లో ఎమీ పండలేదు. ఓ రాత్రి సోమయ్య కొడుకుని వెంటబెట్టుకొని ఊరవతలి పొలానికి వెళ్ళాడు. ఆ పొలం వేరే వాళ్ళది.ఎవరికీ తెలియకుండా ఒక మోపు వరి కంకులుని కోసుకొని పోవాలని సోమయ్య ఆలోచన. పొలం గట్టు మీద రాముని నిలబడమని , నీవు నాలుగు దిక్కులా జాగ్రత్తగా చూస్తుండు. ఎవరైనా కనపడితే నాకు చెప్పు ” అని సోమయ్య కొడుక్కి చెప్పాడు.
సోమయ్య పొలంలో వరికంకులు కోసేందుకని దిగాడో లేదో రాము – “నాన్నా, ఆగండి” అన్నాడు. “ఎవరైనా చుస్తున్నారా ఏం?” – సోమయ్య అడిగాడు. రాము – “ఔను నాన్నా,చూస్తున్నారు”. సోమయ్య పొలంలోనుంచి గట్టుమీదికి వచ్చి చూస్తే అతనికి ఎవరూ కనపడలేదు.అప్పుడు అతని కొడుకుని అడిగాడు – “ఎక్కడ? ఎవరు కనపడటం లేదే?”
రాము – ” దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు. అందరు చేసే పనులు గమనిస్తూ వుంటాడని మీరే చెప్పారుగా! అలాంటప్పుడు మీరు వరికంకులు కోస్తూవుంటే, దేవుడు చూడకుండా వుంటాడా?” సోమయ్య కొడుకు మాటలు విని సిగ్గుతో తల వంచాడు. వెంటనే కొడుకుతో కలిసి ఇంటికి వెళ్ళాడు.