మూర్ఖరాజు

21/01/2010

అక్బర్ కి బీర్బల్ అంటే బాగా ఇష్టం.ఎందుకంటే బీర్బల్ కి గొప్ప తెలివితేటలు ఉండటమే కాకుండా, తన హాస్యోక్తులతో చక్రవర్తిని చాలా సంతోష పెట్టేవాడు.ఒకసారి అక్బరు చక్రవర్తి అంతఃపురానికి వెళ్ళాడు.చక్రవర్తి గారి ప్రియాతిప్రియమైన బేగం తన స్నేహితురాలితో ఏదో మాట్లాడుతున్నారు.చక్రవర్తి అక్కడికి వెళ్ళాడు.బేగం లేచి “దయచేయ్యండి మూర్ఖరాజా! దయచేయ్యండి” అన్నారు.చక్రవర్తికి చాలా కోపం వచ్చింది.కాని ఇంతకు ముందు తనను ఎప్పుడూ ఇలా అనలేదు,అంతేకాక తన తెలివైనది అని తెలుసు.కాని తను ఎందుకు ఇలా అన్నదో అడగడానికి మనసు రాలేదు.అలా కొంచెంసేపు కోర్చొని తన భవనానికి వెళ్ళిపొయాడు.
అలా విచారంగా అలోచిస్తుండగా అక్కడికి బీర్బల్ వచ్చాడు.బీర్బల్ని చూడగానే “మూర్ఖరాజుకి స్వాగతం” అన్నాడు.బీర్బల్ నవ్వుతూ “సంతోషం మూర్ఖరాజూ” అన్నాడు.అప్పుడు అక్బరు కోపంతో “బీర్బల్ నీవు నన్ను మూర్ఖరాజు అని ఎందుకు అన్నావు?” అని అడిగాడు.
బీర్బల్ వినయంగా బదులు ఇచ్చాడు – “ఐదు కారణాల వలన మనిషిని మూర్ఖునిగా జమకడతాం. 1.ఇద్దరు వ్యక్తులు ఏకాంతంగా మాట్లాడుతున్నప్పుడు, పిలవకనే ఎవరైనా వాళ్ళమధ్యకు వెళ్ళినా, ముందుగా తెలుపకుండా వెళ్ళినా అతన్ని మూర్ఖుడంటాం. 2.ఇద్దరు పరస్పరం మాట్లాడుతున్నప్పుడు,వాళ్ళమాటలు ముగియక ముందే మూడో వ్యక్తి జోక్యం కల్పించుకొని ఆ సంభాషణలో చొరబడితే అతన్ని మూర్ఖుడంటాం. 3.ఎవరైనా ఎదుటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు,అతని మాటలు పూర్తిగా వినకుండా మధ్యలో మాట్లాడే మనిషి కూడా మూర్ఖుడంటాం. 4.కారణం లేకుండా ఇతరులను తిట్టెవాళ్ళని కూడా మూర్ఖుడంటాం. 5.అలాగే మూర్ఖుల వద్దకు వెళ్ళే వాళ్ళని, మూర్ఖులతో కలిసి తిరిగే వాళ్ళని కోడా మూర్ఖులంటాం.”
బీర్బల్ మాటలు విన్న అక్బరు సంతోషించి తను చేసిన తప్పుని తెలుసుకొన్నాడు.

నిజం విలువ

20/01/2010

ఒకనొక ఊరిలో ఒక బందిపోటు ఉండేవాడు.ఒకరోజు దొంగతనానికి బయలుదేరాడు.అర్థరాత్రి అవడానికి ఇంకా చాలా సమయం ఉంది.కాలక్షేపం కోసం ఒక సభలోకి వెళ్ళి కూర్చున్నాడు.ఒక సాధువు బోధనలు చేస్తున్నాడు.అతని సూక్తులు ,ప్రవచనాలు చాలా ఆనందంగా,ఆహ్లాదంగా ఉన్నాయి.ప్రవచనాల తరువాత బందిపోటు సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు – “స్వామి నేనొక బంధిపోటుని, చాలా మందిని దోచుకున్నాను, కొంతమందిని చంపేసాను కూడా…దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తం ఉందా?” దానికి సమాధానంగా సాధువు ఇంక నుంచి నిజమే చెప్పు అన్నాడు.
సాధువు మాటలు ఆచరించాలని బంధిపోటు నిర్ణయించుకున్నాడు.మరునాడు రాజుగారి ఖజానాలో నుంచి కొంత ధనన్ని తస్కరించాలని పధకం వేశాడు.అతడు కోట ముఖద్వారం వద్దకు ప్రవేశించగానే భటుడు “ఎవరు నువ్వు” అని ప్రశ్నించాడు.దానికి “నేనొక బందిపొటుని” అని సమాధానం చెప్పాడు.అతని మాటలు భటుడు నమ్మలేదు సరి పైగా మారువేషంలో ఉన్న ముఖ్య అధికారి అని అతనిని లోపలికి అనుమతించాడు.అతను లోపలికి వెళ్ళి బాండాగారంలో  ఉన్న రత్నాల సంచిని తీసుకొని వస్తుంటే మళ్ళి అదే భటుడు “ఏమి తీసుకెళ్తున్నావు ?” అడిగాడు.”రత్నాలు.ఇవే నాకు దొరికాయి.” “ఎవరి అనుమతితో తీసుకెళ్తున్నావు?” “అనుమతా? నాకు ఎవరి అనుమతి అవసరం లేదు. నేను వీటిని దొంగలించుకొని వెళ్తున్నాను.” అని బందిపోటు చెప్పాడు.భటుడు తెల్లబోయాడు.అతనికి అంతా అయొమయంగా ఉంది.బంది పోటుని ఇంకా ముఖ్య అధికారిగానే తలిచి వదిలి వేశాడు.
మరునాడు ఉదయం దొంగతనం బయట పడింది.విచారణలో అపరిచిత వ్యక్తి తను బందిపోటునని చెప్పే దోచుకున్నాడన్న సంగతి బయట పడింది. రాజు ఆశ్చర్య పోయాడు.అతని కోసం గాలించారు.బందిపోటు ఇంకా నగరంలో ఉండడం వలన సైనికులు అతనిని పట్టుకున్నారు.బంధిపోటు రాజుగారితో కూడా నిజమే చెప్పాడు.అతని పట్ల ఆకర్షితుడైన రాజు అతనికి రాజాస్థానలోనే విలువైన వస్తువుకు కాపాడే అధికారిగా నియమించాడు.నిజం మాట్లాడితే జరిగే మంచి ఏమిటొ బంధి పోటుకి ఆరోజు అర్థమైంది.అప్పటినుంచి దొంగతనాలు మాని మంచి బతకాలని నిర్ణయించుకున్నాడు.అలా మంచి వాడిగా మారి రాజాస్థానంలో మంచి పేరు సంపాదించుకునాడు.

మేకపోతు గాంభీర్యం

22/12/2009

ఒక అడవిలో ఒక మేకపోతు ఉండేది.దానికి బాగా పొగరు ఎక్కువ.అది ఒక గుహలో ఉండేది.దానికి బాగా కొమ్ములు ఉండడం వలన తనే బాగా బలమైనది అనే భావంతో ఉండేది.ఒకసారి ఆ గుహలోకి సింహం వచ్చింది.దాని ముందు తన గాంభీర్యాన్ని ప్రదర్శించాలని అనుకున్నది.అప్పుడు ఆ మేకపోతు సింహంతో ఇలా అన్నది – ” నిన్ను అందరు రారాజు అంటారు.కని నేనే నీకంటే బలమైనదాన్ని కదా.నీకంటేనే కాదు ప్రపంచంలో అందరికంటే ” అది విన్న సింహం దాని గర్వాన్ని ఎలగైనా అణచాలని అనుకొని తిరిగి ఇలా అంటుంది – “అవును నీవు చెప్పింది నిజమే నీవే అందరికంటె బలమైనదానివి.నీవు వెళ్ళి ఢీకొంటే ఆ కొండా అయిన బద్దలు అయిపొతుంది”. అది విన్న మేకపోతు అత్యుత్సాహనికి లొనై వెళ్ళి కొండను ఢీకొంటుంది.దెబ్బకి తల పగిలి చస్తుంది.కాబట్టి మన సామర్థ్యం ఎంతవరకో అంతవరకే ఉండాలి.అతి ప్రదర్శనకి పోతే చివరికి ఇలా ప్రాణం మీదకి వస్తుంది.

గొర్రెల కాపరి

17/12/2009

ఒక ఊరిలో ఒక కుర్రాడు గొర్రెలు కాస్తుండేవాడు.వాడు బాగా అబద్దాలు ఆడేవాడు.ఒకసారి గొర్రెలను తోలుకొని అడవికి బయలుదెరాడు.గొర్రెలు మేత మేస్తూ ఉంటే ” అయ్యో  కాపాడండి! తోడేలు నా గొర్రెను తీసుకుపోతుంది అని అరిచాడు.ఆ కేకలు విని చుట్టు పక్కల ఉన్న వాళ్ళు పరిగెత్తు కుంటూ వచ్చారు. వాళ్ళని చూసి పక్కున నవ్వాడు.అందరు చిన్న మొహం వేసుకొని వచ్చినందుకు వాళ్ళను వాళ్ళు తిట్టుకొంటూ వెళ్ళి పొయారు.
ఒక రోజు నిజంగా తొడేలు వచ్చింది.అది గొర్రెల మీదకి వెళ్ళిని వాటిని పట్టుకుంది.ఆ కుర్రాడు నిజంగా భయంతో రక్షించండి! రక్షించండి! తోడేలు వచ్చింది అని అరిచాడు.అందరు వాడు ఒట్టి అబద్దాలు చెప్తున్నాడని ఎవ్వరూ పట్టించుకోలెదు.ఆ తొడేలు మంద మీద పడి ఒక గొర్రెను ఎత్తుకు పోయింది.కాబట్టి ఇలా వెకిలి చేష్టలు చేస్తూ, ఇంకొకళ్ళను వెధవలను చేస్తే మనమే నష్టపోతాం.

చిక్కుల్లో పడ్డ సారసపక్షి

16/12/2009

ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా పక్షులు ఉండేవి.దానికి దగ్గరలో ఒక రైతు పొలం ఉండేది.ఆ రైతు పొలంలో రోజు విత్తనాలు నాటి వెళ్ళడం ఆ పక్షులన్నీ తినేయడం జరుగుతుండేది.దానితో విసుగు చెందిన రైతు వాటి బెడద తప్పించుకోవాలని ఒక ఉపాయం ఆలోచిస్తాడు.ఒక పెద్ద వల తెచ్చి పొలం నిండా కప్పుతాడు.ఆ పక్షులన్నీ వచ్చి వాలుతాయి.వాటితో పాటు ఒక సారస పక్షి కూడా చిక్కుకుంటది.
ఆ రైతు వలలో పడిన ఒక్కొక్క పక్షిని పట్టుకోవడం మొదలుపెడతాడు.అప్పుడు ఆ సారసపక్షి రైతుని ఇలా వేడుకుంటది – “అయ్యా నన్ను వదిలిపెట్టండి. నేను కోడిని కాదు,కొంగను కాదు, విత్తనాలు తినే పక్షిని అసలే కాదు.పంట పొలాల్లో ఉండే చిన్న చిన్న కీడ పురుగులు తినేదాన్ని అని”.
అసలే కోపంగా ఉన్న రైతు దానికి సమాధానంగా – ” నీ మాట నిజమే కావచ్చు.నా పొలంలో విత్తనాలు తినే పక్షులతో పాటు దొరికావు.కాబట్టి నీవు వాళ్ళ స్నేహితుడవే.నీకు కూడా శిక్ష తప్పదు అని చెప్తాడు.” కాబట్టి ఎవడైనా వెధవ పనిచేసేటప్పుడు మనం చేయకుండా పక్కన ఉన్నా అది మన మీదకు వస్తుంది.

చిత్తైన జిత్తులు

15/12/2009

ఒక ఊరిలో ఒక వ్యక్తి కోళ్ళని పెంచుకుంటూ ఉండేవాడు.అయితే రోజుకొక కోడి తగ్గి పోతూ ఉండేది.పాపం తనకి అర్థం అయ్యేదికాదు.ఒక రోజు కాపల వుండి గమనిస్తాడు.ఒక నక్క వచ్చి తన కోళ్ళని తినేస్తుండడం చుస్తాడు.ఎలాగైన దాని పీడ వదిలించుకోవాలని ఒక ఉపాయం పన్నుతాడు.మత్తుమందు కలిపిన దూదితో చేసిన కోళ్ళ బొమ్మలను రోజు ఉండే ప్రదేశం లో పెట్టి దూరంగా వెళ్తాడు.ఎప్పటి లాగే నక్క ఆనందంతో కోళ్ళాని తినాలని వచ్చి ఒక కోడి మెడ కొరుకుతుంది.అది చూసి ఆచర్యపోతుంది.అలా మరో రెండు కోడి  బొమ్మలను కొరుకుతుంది.కొంచెం సేపటికి అది కళ్ళు తిరిగి పడిపొయింది.ఆ కోళ్ళ యజమాని వచ్చి దానిని బంధించి జంతుశాల వాళ్ళకి పట్టిస్తాడు.కాబట్టి ఎన్ని జిత్తులు వేసినా ఎప్పుదొకప్పుడు కచ్చితంగా అవి ఎప్పటికైనా బయట పడతాయి.

తిక్కకుదిరిన కోతి

14/12/2009

ఒక ఊరిలో ఒక కోతి ఉండేది.అది ఒక ఇంటికి ప్రతిరోజు వెళ్ళి నానా గొడావ చెసేది.ఇంట్లో తినేవి తీసుకెళ్ళడం,పాత్రలను(గిన్నెలు) పగలకొట్టడం, పిల్లలను కరవడం చేస్తుండేది.ఆ ఇంట్లో వాళ్ళు దాని ఆగడాలు భరించలేకపోయారు.ఒక సారి ఆ ఇంటి యజమాని సహించలేక దానిని ఎలాగైన పట్టుకొని బయటకి పంపాలి అనుకొన్నాడు.దాని కోసం ఒక చిన్న మూతిగల గిన్నెలో వేయించిన శనగలు వేసి గది మధ్యలో భూమిలో పాతి పెట్టి తలుపులు అన్ని తెరిచి ఇంట్లో అందరు బయటకి వెళ్ళి పోయారు.
ఎప్పటిలాగే అది ఇంట్లో దూరింది.అటు ఇటు ఎగిరి పాత్రలో ఉన్న శనగలను చూసింది.అవి తీసుకొవాలని గిన్నెలో చెయి పెట్టి, చేతి నుండా శనగలు తీసుకొంది.మూతి చిన్నది కావడం వలన చెయ్యి బయటకి రాలేదు. చేయి బయటకి తీయాలని గింజుకుంది.ఎగిరింది.ఆశకొద్ది శనగలను మాత్రం వదలలేదు.అంతలో ఇంటి యజమాని వచ్చి తాళ్ళతో దానిన్ని కట్టి  వేసి, ఎవరికో అప్పగించాడు.అత్యాశతో ఇలాంటి పనులు చేస్తే ఇలానే తిక్క కుదురుంది.

మిడాస్ అత్యాశ

10/12/2009

ఒక రాజ్యనికి మిడాస్ అనే రాజు ఉండేవాడు.అతనికి బంగారం బాగా ఆశ.తన దగ్గర ఎంత బంగారం , ధనం ఉన్నా కాని ఇంకా ఇంకా కావాలి అని ఆశించేవాడు.అలా చాలా ధనాన్ని కూడ పెడతాడు.ప్రతిరోజూ దేవుడిని ఇంకా ధనం కావాలని ప్రార్థిస్తుంటాడు.ఒక రాత్రి తను నిద్రలో ఉన్నప్పుడు తన ముందు దేవత ప్రత్యక్షమవుతుంది.మిడాస్ నీకు ఎమి కావాలో కొరుకో అంటుంది.అప్పుడు మిడాస్ నాకు చాలా బంగారం కావాలి అని కోరుకుంటాడు.కాదు కాదు నేను ఎది తాకితే అది బంగారం కావాలి అని చెప్తాడు.అప్పుడు దేవత తదాస్తు అన్నది.
ఆనందంతో ప్రక్కన రోజు ఉదయాన్నే లేచి  అన్ని వస్తువులను తాకుతూ ఉంటాడు.అవన్నీ వెంటానే బంగారంగా మారి పోతుంటాయి.తన తినే కంచం దగ్గర నుంచి, ఉద్యానవనంలోని పూల వరకు అన్నీ తాకుతాడు. అవన్నీ బంగారంగా మారిపోతుంటాయి.దానికి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంటాడు.అన్నీ తాకి తాకి బాగా అలసి పొయిన తను ఎదైనా పండు తిందామని ఒక పండు పట్టుకుంటాడు.అది వెంటనే బంగారపు పండుగా మారిపోతుంది.మంచినీళ్ళు తాగదామని పట్టుకుంటే అవి కూడా బంగారం మారిపోతాయి.అలా అన్నం ప్రతి ఒక్కటీ బంగారం మారిపోతుంటాయి.దానితో ఎంతో నిరాశ చెంది పాడుకుంటాడు.తన కూతురు దగ్గరకు వస్తుంది.తనను దగ్గరకు తీసుకుందామని పట్టుకొనే సరికి తను కూడ బంగారు బొమ్మ అయిపోతుంది.
దానిఎతో తను తప్పు చెశానని తెలిసుకొని దేవత వేడుకొని తనను సాధారణ స్థితికి తీసుకురమ్మని వేడుకుంటాడు.దేవ్త మిడాస్ క్షమించి తనను మాములుగా చేస్తుంది.బంగారంగా మారినవన్ని ఎప్పటిలాగా మారిపోతాయి.కాబట్టి అత్యాశ పడితే ఇలానే ఉంటుంది.

పాపం ముంగిస

09/12/2009

ఒక ఊరిలో ఓ రైతు ముంగిసను పెంచుకొనేవాడు.అది చాలా తెలివైనదే కాక, దానికి స్వామిభక్తి కూడ ఎక్కువ.ఒక సారి రైతు పని మీద బయటకి వెళ్ళాడు.రైతు భార్య తన పసిబిడ్డకు పాలిచ్చి ,నేల మీద పడుకోబెట్టింది.బావి నుంచి మంచి నీళ్ళు తీసుకొద్దామని కడవ,చేద(తాడు) తీసుకొని బయలుదేరింది. వెళ్తూ ముంగిసకి పాపని చూడమని చెప్పి వెళ్ళింది.
ఆమె వెళ్ళగానే పుట్టలో నుంచి ఒక నాగు పాము వచ్చి , ఇంటిలోకి ప్రవేశించింది.ఆ పాము చిన్నగా ప్రాకుకుంటూ పాప వైపు పోసాగింది.ఇది గమనించిన ముంగిస పాముని పట్టుకొని రెండు ముక్కలు చేసింది.తలుపు దగ్గరికి వచ్చి రైతు భార్య కోసం ఎదురు చూడసాగింది.ఆమె నీళ్ళు తీసుకొని వచ్చి తలుపుదగ్గర, మూతి నుండి రక్తం కారుతున్న ముంగిసను చూసింది.ముంగిస పాపను ఎక్కడ కోరికి పడవేసిందో అని అపార్థం చేసుకొని ఆ నీళ్ళ కడవను ఎత్తి దాని తల పైన వేసింది.దానితో అది చనిపొయింది.
ఆమె పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి చూస్తే పాప హాయిగా నిద్రపోతూ ఉంది.ప్రక్కన పాము రెండు ముక్కలై పడి ఉంది.అప్పుడు ఆమె తను పొరపాటు చేశానని తెలుసుకొని పరిగెత్తుకుంటూ ముంగిస దగ్గరకి వెళ్ళింది.కాని ఏమి లాభం అప్పటికి అది చనిపొయింది కదా! అప్పుడు దానిని ఒళ్ళో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది.కాబట్టి ఏ పనైనా ఆలోచించకుండా చేస్తే తరువాత పశ్చాతాప పడిన ఉపయోగం లేదు.

పిశినిగొట్టువాడికి పది టోపిలు

08/12/2009

ఒక సారి రంగయ్య అనే పిశినిగొట్టోడికి ఒక చిన్న గుడ్డ పేలిక  దొరికింది.దానితో ఒక చొక్క కుట్టించుకోవాలని దర్జీ(టైలర్) దగ్గరికి వెళ్తాడు.దర్జీ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు – “నా దగ్గర ఉన్న ఈ గుడ్డతో చొక్క వస్తుందా.” ఆ పేలికని చూసి ఆ దర్జీ ఇలా అన్నాడు – “అయ్యా దీనితో చొక్కా కుట్టడం కష్టం ఒక టొపీ అయితే కుట్టగలను.” అప్పుడు ఆ రంగడు రెండు కుట్టలేవా అన్నాడు.దర్జీ ఆలొచించి కుట్టగలను అన్నాడు.రంగయ్య సరే అని కుట్టమని చెప్పి వెళ్ళాడు.కొంచెంసేపటి తరువాత మళ్ళీ వచ్చి ఐదు టోపీలు కుట్టాడం కుదరదా అని అదిగాడు. ఆ దర్జీ మళ్ళీ అలోచించి సరే అన్నాడు.కొంచెం సేపు ఆగి మళ్ళీ వచ్చి పది టోపీలు కుట్టమని చెప్పి వెళ్ళిపొయాడు.
రంగయ్య ఆ మరుసటి రోజు వచ్చి టొపీలు ఇవ్వమని అడిగాడు.ఆ దర్జీ తను కుట్టిన పది టోపీలు ఇచ్చాడు.అవి సరిగ్గా తన చేతి పది వ్రేళ్ళకు సరిపొయాయి.అవి చూసి బిక్కమొఖం వేసుకొని వెళ్ళాడు.మరీ పిశినారిగా ఉంటే మొదటికే మోసం వస్తుంది.