ఉపకారికి ఉపకారం

08/12/2009

ఓ నది గట్టు మీద ఓ చెట్టు ఉండేది.ఆ చెట్టు కొమ్మ మీద ఓ పావురం కూర్చొని ఉంది.అది నీళ్ళలో ఒక చీమ కొట్టుకుపోవడం చూసింది.ఆ చీమ బయటపడాలని ఎంత ప్రయత్నించిన నీటి ప్రవాహనికి దాని ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి.ఇంకొద్దిసేపటిలో అది మునిగిపొవడం తరువాయి.ఇదంతాచూసిన పావురానికి జాలి కలిగింది.అప్పుడు అది తన ముక్కుతో ఒక ఆకు విరిచి చీమకు దగ్గరగా నీటిలో పడవేసింది. చీమ ఆకు పైకి వచ్చింది.ఆ ఆకు కొట్టుకుంటూ గట్టు దగ్గరకు వచ్చింది.గట్టు మీదకు వచ్చిన చీమ పావురానికి కృతజ్ఞత తెలిపింది.
అప్పుడే ఓ పిట్టలు పట్టేవాడు అక్కడికి వచ్చి చెట్టు కింద దాక్కున్నాడు.పావురం వాడిని గమనించలేదు.వలకట్టిన కర్రను మెల్లగా పావురం దగ్గరికి పోనివ్వసాగాడు.ఇది చూసిన చీమ గబగబా చెట్టు దగ్గరకి పొయింది.పాపం! దానికి మాట్లాడం రాదు.లేకపొతే పావురాన్ని పిలిచి చెప్పేది.తనను కాపాడిన పావురాన్ని ఎలగైనా కాపాడాలని నిశ్చయించుకుంది. అది చెట్టు కింద కూర్చున్న పిట్టలు పట్టేవాడి తొడవరకు పాకి, వాడిని గట్టిగా కుట్టింది.
దెబ్బతో వాడు అబ్బా అని కదిలాడు,వాడి చేతిలో ఉన్న కర్ర కూడ కదలడంతో చెట్టు మీ ద ఆకులు గలగలా అన్నవి.ఆ చప్పుడుకు పావురం ఎగిరిపొయింది.కష్టాలలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది ఊరికే పోదు,మనకు కచ్చితంగా తిరిగి దాని ఫలితం లభిస్తుంది.

ఐకమత్యం

07/12/2009

ఒక ఊరిలో శంకరయ్య అనే వ్యక్తి ఉండేవాడు.అతనికి ఐదుమంది కొడుకులు శివరామ్,శివదాస్,శివశంకర్,శివప్రసాద్,శివకుమార్. వీరైదుగురు చీటికిమాటికి తిట్టుకోవడం,కొట్టుకోవడం చేసేవారు.అదిచూసి విసిగిపోయిన శంకరయ్య వాళ్ళకి బుధ్ది చెప్పాలని అందరిని పిలిచాడు.సన్నగ చీల్చిన కట్టెలను మోపుగా కట్టాడు.అది వాళ్ళకి చూపించి “మీలో ఎవరైన ఈ మోపుని విరగ్గొట్టగలిగితే వారికి రూపాయి బహుమతిగా” – అని చెప్పాడు.
అప్పుడు అందరు నేనంటే నేను అని పోటీపడుతూ కొట్లాడుకోసాగారు.అప్పుడు శంకరయ్య ఇలా కాదు ముందు శివకుమార్ కి అవకాశం ఇద్దాం అని చెప్పాడు.శివకుమార్ తన శక్తిని అంతా కూడగట్టుకొని విరగొట్టడానికి ప్రయత్నించాడు.కాని విఫలమయ్యాడు.అలా తరువాత ఒకరి తరువాత ఒకరు అందరు ప్రయత్నించారు.ఎవరూ కూడా ఆ మోపుని విరగొట్టలేక పొయారు.అప్పుడు శంకరయ్య ఆ కట్టెల మోపుని విడదీసి అందరికి ఒక్కొక్క కట్టెని ఇచ్చాడు అందరూ వాటిని సునాయాసంగా విరిచారు.
శంకరయ్య ఇలా చెప్పాడు – ” చూశారా ఆ కట్టెలు అన్ని కలిసి ఉన్నప్పుడు మీలో ఏ ఒక్కరు కూడ విరగొట్టలేకపొయారు అవి ఒక్కొకక్కటిగా వుంటే మీరు వాటిని విరగొట్టగలిగారు.అలాగే మీరు కలిసి ఉంటే మిమ్మలని ఎవరూ ఎమీ చేయలేరు.”
ఆ రోజు నుంచి వారైదుగురు కలిసిమెలిసి ఉండసాగారు.కాబట్టి ఐకమత్యమే మహాబలం

పనికిరాని వైదుడు

04/12/2009

ఒకసారి సుబ్బయ్య కొడుకు సోము జబ్బున పడ్డాడు.మామిడి కాయలు కోసుకుందామని మలమలామాడే ఎండలో జారుకున్నాడు.బాగా ఎండ తగిలి ఇంకా జ్వరం ఎక్కువైంది.సుబ్బయ్య వైద్యుడిని పిలిపించాడు.వచ్చిన వైద్యుడు నాడి పట్టుకొని చూసి మీ అబ్బాయికి వడదెబ్బ తగిలింది.ఈ పిల్లాడు బాగా అల్లరివాడు లాగా ఉన్నాడు,పెద్దల మాటలు వినేలాగా లేడు అని తిట్ల దండకం మొదలుపెట్టాడు.అది సుబ్బయ్యకి నచ్చలేదు.
దానితో సుబ్బయ్య వైద్యునికి నమస్కారం పెట్టి “అయ్యా మిమ్మలని పిలిపించి ఒక పెద్ద పొరపాటు చేశాను.ఇదిగో మీ ఫీజు తీసుకొండి.ఇంక మీరు దయచేయండి.నేను మా అబ్బాయికి చికిత్స కోసం వేరే వైద్యుని పిలిపిస్తాను.జ్వరం వచ్చిన వాడిని తిట్టి పోస్తూ, వాడికి ఇంకా బాధ కలిగిస్తున్నారే కాని వాడి అవస్థ చూసి జాలి పడటం లేదు.” అని చెప్పాడు.దానితో ఆ వైద్యుడు సిగ్గుతో తల వొంచుకొని వెళ్ళిపోయాడు.
కష్టాలలో ఉన్న వాళ్ళని మరిన్ని సలహాలు ఇచ్చి,సానుబూతి తో ఓదార్చాలి కాని వాళ్ళని సూటి పోటి మాటలతో మరింత క్రుంగతీయకూడదు.

బ్రహ్మదేవుని సంచులు

04/12/2009

ఒక సారి బ్రహ్మదేవుడు మానవుని పిలిచి నీకు ఎమి కోరిక కావాలో కొరుకోమన్నాడు.అప్పుడు మానువుడు ఇలా అడిగాడు.స్వామి నేను అష్ట ఐశ్వర్యాలతో విరజిమ్ముతూ ఉండాలి.అంతేకాకుండా నేను కోరుకున్నవి అన్ని జరుగుతుండాలి అని చెప్పాడు.అప్పుడు దేవుడు అతనికి రెండు సంచులు ఇచ్చాడు.ఇచ్చిన తరువాత “చూఒడు నాయనా ఈ రెండు సంచులలో ఒకదానిలో నీ తప్పులు , రెండవ దానిలో ఇతురుల తప్పులు ఉన్నాయి.నీవు ఎప్పుడు నీమూటాను ఎదురుగా వ్రేలాడదీసుకొని ప్రతిరోజు విప్పు చుసుకుంటుండు.ఇతరుల మూటను వీపు పిన వేసుకో.ఎప్పుడు కూడా దానిని విప్పి చూడాలని ప్రయత్నించకు  అని చెప్పాడు.
కాని మానవుడు ఒక పొరపాటు చేస్తాడు.తన తప్పులు ఉన్న మూటను వీపు మీద వేసుకొని ఇతరుల తప్పులను విప్పి చూస్తుంటాడు. అంతేకాకుండ వాటిని అందరికి చూపిస్తుంటాడు.దానితో అతనికి ప్రశాంతత లేకుండా పోవడమే కాకుండా అందరు అతనిని దూషించడం మొదలు పెట్టారు.కాబట్టీ ఇతరుల తప్పులను ఎత్తిచూపేకంటే మన తప్పులను సరి చేసుకోవడం ఎంతో మంచిది. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం.

పొరపాటు

02/12/2009

ఓ  కుక్కకు పక్షుల గుడ్లు తినే అలవాటు ఉండేది.అది పొలం గట్ల మీద,నదితీరాలలో తిరుగుతూ పిట్టల గుడ్లు కనపడితే చాలు లటుక్కున మింగేది.అంతేకాకుండా చెఱువుల వెంబడి తాబేళ్లగుడ్లకోసం వెతుకుతూ ఉండేది.అయితే అనుకొకుండా నత్తగుల్లను చూసింది.దాన్ని ఏదో గుడ్డు అనుకొని గబుక్కున మింగేసింది.దాని పొట్టలోకి వెళిన నత్తగుల్ల పొలుకులు బాగా బాధించసాగాయి.ఆ కుక్క బాధతో విల విల లాడ సాగింది.
అప్పుడు ఆ కుక్క ఇలా అనుకోసాగింది.”గుండ్రటి వస్తువులన్ని గుడ్లని పొరపాటు పడ్డాను.నాకు బుద్ధి వచ్చింది.కంటికి కనపడ్డ వస్తువులన్ని తింటే ఇలా బాధ పడాలిసి వస్తుంది.తినదగిన వస్తువు ఏదో తెలుసుకొని తినాలి.తెలుసుకొని తిని ఉంటే ఈ బాధలు ఉండేవి కాదు.” కాబట్టి ఏ పని అయిన చేసేముందు ఆలోచించి చేయాలి.

పరోపకారం

01/12/2009

ఒకానొకప్పుడు పర్షియా దేశానికి నౌషర్వా అనే చక్రవర్తి ఉండేవాడు.ఆయన న్యాయపరిపాలనుకు బాగా ప్రసిధ్ది.అంతేకాకుండా ధానధర్మాలు కూడా ఎక్కువగా చేసేవాడు.ఒక రోజు ఆయన మంత్రితో కలిసి షికారుకు కి బయలుదేరాడు.ఓ తోటలో ఒక ముసలాయన ఖర్జూరం మొక్కలు నాటడం చూశాడు.అప్పుడు ఆ ముసలాయన వద్దకు వెళ్ళి “నీవు తోటమాలివా లేక యజమానివా ?” అని అడిగాడు.
అప్పుడు ఆ ముసలాయన ఇలా వినయంగా చెప్పాడు – “నేను ఎవరి కింద పని చేయడం లేదు.ఈ తోట మా తాతముత్తాతలు నాటింది”. అప్పుడు బాదుషా ఇలా అడిగాడు – “నీవు ఈ ఖర్జూరం మొక్కలు నాటుతున్నావు.ఇవి చెట్లయి ,పళ్లు కాచేంతవరకు నీవు బతికి ఉంటావా?”.అప్పుడు ముసలి తోట మాలి ఇలా అన్నాడు – “ఖర్జూరం మొక్క పెరిగి పెద్దదయి పళ్లనివ్వడానికి ఇరవైఏళ్లు పడుతుంది.నేను ఇప్పటి వరకు మాతాతలు నాటిన చెట్ల పళ్ళను తిన్నాను.అందువల్ల నా తరువాతి తరాల వాళ్లు తినేందుకు నాటాలి.తాను పళ్లు తినడానికి చెట్లు నాటడం స్వార్థం”
అది విని సంతోషించిన చక్రవర్తి అతనికి రెండు బంగారు నాణేలు ఇచ్చాడు. కాబట్టి పరోపకారం చేస్తే ఆ పుణ్యం ఎక్కడికి పోదు.

ఆశపోతు

26/11/2009

ఒక కుక్క రొట్టెముక్క నోటికి కరుచుకుని పోతూవుంది.దారిలో ఓవాగు అడ్డం వచ్చింది.నీళ్లు లోతుగా లేనందువల్ల కుక్క జాగ్రత్తగా వాగు దాటసాగింది.కుక్కకు నీటిలో తన ప్రతిబింబం కనపడింది.అప్పుడు తనలో తాను ఇలా అనుకోసాగింది-“నీళ్లలో మరో కుక్క రొట్టె ముక్క తీసుకొని పోతూవుంది.నేను దానిని కాస్తాలాక్కుంటే, రెండు రొట్టెలను ఎంచక్కా తినొచ్చు.”
అలా వెంటనే నీళ్లలో కనపడే కుక్క నోటిలో నుంచి రొట్టె ముక్క లాక్కొవాలని కుక్క నోరు తెరిచింది.అప్పుడు దాని నోట్లో వున్న రొట్టెముక్క కూడా నీళలో పడి కొట్టుకు పొయింది.అప్పుడు కుక్క బిక్క మొఖం వేసుకొని పొయింది.మనకున్నది కాకుండా వేరే దాని కోసం ఆశపడితే మనకున్నది కూడ పొతుంది.
అయితే మన తెలుగులో దీనికి ఒక సామెత ప్రసిద్ది.”ఉన్నది పొయే వుంచుకున్నది పొయే.

మనఃశాంతి

25/11/2009

ఒక వ్యక్తి జీవితం మీద బాగా విరక్తిచెందాడు.అలా మనఃశాంతి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు.అతనికి ఒక సాధువు కనిపిస్తాడు.ఆ సాధువు దగ్గరకి వెళ్ళి ఇలా అంటాడు “స్వామి నాకు ఒకేఒక గది కలిగిన ఇంటిలో నేను,నా భార్య,మా ఇద్దరు పిల్లలు,మా అమ్మనాన్న,అత్త మామలు ఉంటున్నాము దానితో నాకు మనఃశాంతి కరువైంది” మీరు ఎలాగైనా మనఃశాంతిని ప్రసాదించండి అని అడుగుతాడు.అప్పుడు ఆ సాధువు నీవు నేను చెప్పినట్లు చేస్తే నీకు ఖచ్చితంగా మనఃశాంతి దొరుకుతుంది అని చెప్తాడు.ఆ వ్యక్తి చెప్పండి స్వామి నేను మీరు చెప్పింది చేస్తాను అని అంటాడు.
సాధువు ఇలాచెప్తాడు వాళ్ళ అందరితో పాటు నీ గేదలను,కోళ్ళను,కుక్కను నీ ఇంటిలో ఉంచుకొని వారం రోజుల తరువాత నా దగ్గరకు రా అని చెప్తాడు.అతను వెంటనే వెళ్ళి స్వామి చెప్పినట్లు చేస్తాడు.దానితో అతను ఇంకా విసుగు చెంది రెండవ రోజునే సాధువు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు “స్వామి నాకు ఇప్పుడు ఇంకా పిచ్చి ఎక్కిపోతుంది అని”.అప్పుడు ఆ సాధువు నీవు కొత్తగ తెచ్చిన వాటిని అన్నింటిని తిరిగి బయటకు పంపు అని చెప్తాడు.అతను వెంటనే వెళ్ళి ఆ పని చేస్తాడు.అప్పుడు అతనికి బాగా ప్రశాంతంగా ఉంతుంది.ఈ విషయాన్ని మళ్ళి వచ్చి సాధువుకి చేప్తాడు.
ఆ సాధువు తిరిగి ఇలా చెప్తాడు.నాయనా మనకు ఉండేవే కష్టాలు కాదు,దానికంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి.మనము ఉన్న పరిస్థితిలో నే ప్రశాంతత ఉంది అని భావించాలి. అప్పుడే మనం మనఃశాంతిగా ఉండగలం.

ప్రత్యుపకారం

24/11/2009

ఒక సారి సింహాం కాలికి ముల్లు గుచ్చుకుంది.అది ఎంత ప్రయత్నించిన ముల్లు తీయడం  దాని వల్ల కాలేదు.అలా కుంటుతూ వెళ్తుంటే ఒక గొర్రెల కాపరి కనిపించాడు.ఆ సింహం అతని వైపు నడవడం మొదలుపెట్టింది.దానిని చుసి ఆ కాపరి వణికి పోతున్నాడు.తప్పించుకుందామని అటు ఇటు చూసాడు, ఏదైనా చెట్టు కనపడుతుందేమో అని అదైన ఎక్కి తన ప్రాణాలు కాపాడుకుందామనుకున్నాడు.కాని మరో దారి లేక అక్కడే బిక్కు బిక్కుమంటు కూర్చొన్నాడు.
సింహం గర్జించలేదు.మెల్లగా గొర్రెల కాపరి దగ్గరకి వచ్చి కూర్చుని కాలుచాచింది.అప్పుడు ఆ కాపరి తన సహాయం కోసం వచ్చిందని అర్థంచేసుకొని ముల్లును తీశాడు.ఆ సింహం తను వచ్చిన దారినే వెళ్ళింది.
కొన్ని రోజులు తరువాత రాజభవనంలో దొంగతనం జరిగింది. అయితే గొర్రెల కాపరి అంటే గిట్టని వాళ్ళు తన మీద నేరం మోపి రాజు గారికి పట్టించారు.ఆ దొంగలింపబడిన వస్తువులు కాపరి దగ్గర దొరకలేదు.దానితో కొపం వచ్చిన రాజు ఆ కాపరిని సింహనికి ఆహరంగా పడేశాడు.పాపం ఆ గొర్రెల కాపరి భయంతో వణికిపొతున్నాదు ఎక్కడ సింహం తనని తినేస్తుందొనని.అప్పుడే ఒక విచిత్రం జరిగింది.ఆ సింహం ఒకప్పుడు తనతో ముల్లు తీయుంచుకున్నదే.అది ఆకాపరిని గుర్తుపట్టింది. తన దగ్గరికి వచ్చి తన చుట్టూ తిరుగుతూ తొక ఆడిస్తూ పక్కన కూర్చుంది.
అది చూశిన రాజుకు ఆశ్చర్యం వేసింది.రాజు గొర్రెల కాపరిని అడిగి విషయం తెలుసుకొని అతనిని విడీచిపెట్టాడు.సింహంలాంటి భయంకర జంతువు కూడ చేసిన మేలును మరువలేదు.కాబట్టీ మనం చేసిన మేలు మరువకూడదు.అదేవిధంగా మనం చేసిన మేలు కూడ వృధాగా పోదు.

మోసపు గాడిద

19/11/2009

అనగనగా ఒక గాడిద ఉండేది.అది అడవిలో మేస్తూ ఉండేది.అయితే ఒకసారి దానికి సింహం చర్మం దొరికింది.దాన్ని ఒంటి నిండా కప్పుకొని సింహంలా తయారయింది.అందరిని భయపెడుతూ,వాళ్ళు పారిపోతుంటే ఆనందించేది.అలా పంట పొలాలు మేస్తూ హాయిగా గడిపేది.రైతులు దానికి భయపడి ఏమీ చేయలేక పోయేవారు.తనే మృగరాజు అని చెప్పి అడివి జంతువులను కూడ భయపెట్టేది.అలా దొంగ తిండి తిని అది బాగా బలిసిపొయింది.
ఒక రోజు పంట పొలంలో పడి మేయడం మొదలుపెట్టింది.ఎక్కడి నుంచో దానికి ఒక గాడిద శబ్దం వినపడింది.గాడిదబుద్ది పోదు కాబట్టి  అది ఆనందం తో తిరిగి అరవసాగింది. దాని సింహం గుట్టు బయట పడింది.అది విన్న పంట కాపలాదారులు వచ్చి తరిమి తరిమి కొట్టారు. ఇతురులను మోసం చేసేవాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు బయటపడకతప్పదు.